Friday, February 22, 2008

జయప్రద థియేటర్లపై ఆఫీసర్ల దాడులు

సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రదకు చెందిన సినిమా థియేటర్లపై చెన్నై నగరపాలక సంస్థ అధికారులు శుక్రవారంనాడు దాడులు నిర్వహించారు. చెన్నైలో జయప్రద పేరు మీద ఒక థియేటర్, ఆమె సోదరుడి పేరు మీద మరో థియేటర్ ఉన్నాయి. ఒక వాణిజ్య సముదాయం కూడా ఉంది.జయప్రద నగరపాలక సంస్థకు 19 లక్షల రూపాయల పైచిలుకు బాకీ పడ్డారు. ఎన్ని సార్లు నోటీసు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఎట్టకేలకు నగరపాలక సంస్థ అధికారులు థియేటర్లపై దాడులు చేశారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శనను నిలిపేశారు. థియేటర్లలోని సినిమా రీళ్లను, ఇతర వస్తువులను తీసికెళ్లారు.

భక్తిపారవశ్యంలో మేడారం

గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క, సారలమ్మ జాతరతో మేడారం జనసంద్రంలా మారింది. తెలంగాణా ప్రాంతంలో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కిన ఈ సంబరానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ గద్దెను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కాకతీయుల కాలంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన అకృత్యాలపై తిరగబడిన సమ్మక్క- సారలమ్మలను ఇక్కడి గిరిజనులు ఆరాధ్యదేవతలుగా భావిస్తారు. రెండేళ్ళకోసారి మేడారంలో వారి పేరిట జాతర నిర్వహిస్తారు. దీనికి ఈ ఏడాది తొలి రెండు రోజుల్లోనే అరకోటి మంది భక్తులు రావడం ఈ జాతర ప్రత్యేకతను చాటుతుంది. ఇందులో సమ్మక్క, సారలమ్మలను గద్దెనెక్కించడం ఒక ఘట్టం కాగా, అనంతరం భక్తులు బెల్లం సమర్పించి పూజలు చేయడం ఆనవాయితీ. గిరిజన ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారులు చిలుకల గట్టుపై ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గట్టుమీదకు తీసుకువచ్చారు. 'సమ్మక్క తల్లికి జై' అంటూ భక్తులు ఆనంద, భక్తి పారవశ్యంతో నినాదాలు చేశారు. సమ్మక్కకు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టారు. కోళ్ళను, మేకలను బలి ఇచ్చారు. సమ్మక్క దారికి అడుగడుగునా రక్త తర్పణం చేశారు. మూడో రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సమ్మక్కను దర్శించి పూజలు చేశారు. అమ్మకు ప్రీతిపాత్రమైన బెల్లం సమర్పించారు. ఈ జాతరలో సమ్మక్కకు నిలువెత్తు బెల్లం సమర్పించడం ఆనవాయితీ. దీనిని బంగారంతో పోల్చుతూ, భక్తులు తమ తలలపై బెల్లం దిమ్మలను మోసుకు వస్తారు. అమ్మవారికి ఎన్ని కిలోల బెల్లం సమర్పించినా, ఆ ప్రాంతంలో చిన్న ఈగ గానీ, చీమ గానీ పట్టకపోవడం విశేషం. ఇలా జరగడం అంతా సమ్మక్క దయ అని భక్తులు భావిస్తారు.

Thursday, November 29, 2007

సరికొత్త విధానాలకు లోక్ సత్తా శ్రీకారం

ప్రపంచంలోనే తొలిసారిగా రాజకీయాల్లో సరికొత్త విధానానికి లోక్ సత్తా పార్తీ పునాది వేసింది. అభ్యర్ధుల ఎంపిక, నిధుల సేకరణ, ఖర్చు, బహిరంగ చర్చల్లో పాటిస్తున్న ప్రమాణాలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించేందుకు అంబుడ్స్ మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్ప రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ విశిష్ట న్యాయమూర్తిని కమిటీ సభ్యులుగా నియమించనున్నట్టు ఆ పార్టీ వ్యవస్ధాపకుడు తెలిపారు.

రాజకీయాల్లోకి పవన్?


సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ (బియస్పీ)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్న మాట వాస్తవమేనని బియస్పీ వర్గాలు చెప్పినట్లు ఒక తెలుగు వార పత్రిక రాసింది. చిరంజీవి సొంత రాజకీయ పార్టీని పెట్టి బియస్పీతో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి నుంచి తగిన స్పందన లేకపోవడంతో తన కొంత మంది సన్నిహితులతో కలిసి పవన్ బియస్పీలో చేరనున్నట్లు ఆ పత్రిక రాసింది. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం. పద్మనాభం, మాజీ రాష్ట్ర మంత్రి డి.కె. సమరసింహారెడ్డి వంటివారిని బియస్పీ నాయకత్వం తన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను కలవడంలోని ఆంతర్యం కూడా ఇదేనని అంటున్నారు. చిరంజీవి ప్రమేయం లేకుండా పవణ్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అనుకోలేం.

విదేశాల్లో మృత్యువుతో పోరాడుతున్న భారత విద్యార్ధి






ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్ధి సురేష్ దురదృష్టవశాత్తూ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్ళి మృత్యువుతో పోరాడుతున్నాడు. సురేష్ కు ఎటువంటి వైద్య భీమా లేకపోవడం వల్ల... వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో సురేష్ కు చికిత్స చేయడానికి ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. సురేష్ ను డిశ్చార్జి చేస్తామంటు ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఈ భారతీయ విద్యార్ధి సురేష్ ను ఆదుకునేందుకు దయా హృదయులు ఆపన్నహస్తం అందించాలని(తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) "తామా" కోరుతుంది. సురేష్ ఈస్ట్రన్ ఇల్లెనొయిస్ విశ్వ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సురేష్ ను కాపాడేందుకు (తామా) ఆధ్వర్యంలో దాతల నుంచి సహాయ సేకరణ చేపడుతున్నారు. సురేష్ జీవితాన్ని నిలబెట్టడానికి దాతలు సహాయం అందించాల్సిందిగా "తామా" కోరుతోంది. దాతలు సహాయం చేయడానికి ఈ క్రింది ఫోన్ నెంబర్లుకు ఫోన్ చేయవచ్చు. రమేశ్ పెంచల: 404-422-4583 శ్రీనివాస రెడ్డి: 614-735-8472 మహీందర్ కనపర్తి: 299-289-0176 రోహిత్ మునగాళ్ల: 217-819-8298 శ్రీధర్ రెడ్డి: 903-366-1317 మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్లో చూడవచ్చు http://www.help-suresh.org

Friday, August 10, 2007

సినీవనంలో మోనికాలెందరో...?

సినీ పరిశ్రమ...రంగులలోకం...ఎందరో యువతీ యువకుల కలల ప్రపంచం. ఒక్కసారైనా సినిమాల్లో నటించాలనే కోరిక చాలామంది యువతలో ఉంటుంది. దానికి కారణం సినీ ఫీల్డ్ కున్న గ్లామర్ మరే ఫీల్డ్ కు లేకపోవడమే. లక్కు బాగుంటే రాత్రికి రాత్రే స్టార్ ఐపోవచ్చనే ఆశనే యువతని అటువైపు అడుగులు వేయిస్తోంది. అతి తొందరగా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచ్చేది కూడా ఆ రంగంలోనే. అయినా ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే రెండోవైపు చూస్తే ఎవరైనా సినిమాఛాన్స్ లపై ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే సినీరంగంలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. నిలదొక్కుకోవడం మాట అటుంచి, మొదట ఎంట్రీ దొరకడమే వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. అది ఎంతలా అంటే అమెరికాలో గ్రీన్ కార్డు దొరకేంత అని చెప్పొచ్చు. సినిమాల్లోకి ప్రవేశించడం ఒక ఎత్తైతే అందులో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. అంతో ఇంతో టాలెంట్ ఉన్నా, తెలిసిన వ్యక్తులు ఆ ఫీల్డ్ లో పని చేస్తున్నా ఎన్నో కొన్ని లకారాలు సమర్పించుకోందే పని జరగదు. ఇదంతా మగమహారాజులు సంగతి. ఇక ఆడపడుచుల ఆగచాట్లు ఇంకా దయనీయంగా ఉంటాయి. అందంగా ఉన్నా, నటన తెలిసి ఉన్నా మొదటి అవకాశాలు కోసం మొక్కుబడి తప్పటం లేదు. ఎవరు అవకాశం ఇస్తామన్న నమ్మడం, నమ్మి మోసపోవడం మామూలైపోయింది.అష్టకష్టాలుపడి తెరమీద కొచ్చిన అతివల కథ మరో విధంగా ఉంది. వచ్చిన చిన్న చిన్న అవకాశాలను చేజిక్కుంచుకుని సెటిల్ అయ్యేవరకు వారు ప్రతి వారికి లోబడే ఉండాలి. తీరా కుదురుకున్నాక ఏ బడా పారిశ్రామికవేత్తో, మాఫియా లీడరో, రాజకీయ నాయకుడో కన్నేసినా సదరు నటి తలవంచాల్సిందే. కొందరు నటీమణులు తమకో ఆర్టిస్ట్ తోనో, ప్రోడ్యూసర్, డైరెక్టర్ తోనో ప్రేమలో కూరుకుపోతుండగా, మరికొందరు బెదిరింపుల వల్ల లొంగిపోతున్నారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టి అశేష అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి దివ్యభారతి మృతి ఉదంతం అప్పట్లో ఓ సంచలనం. అది హత్యా..? ఆత్మహత్యా? అనేది ఇప్పటికి ముగింపులేని సస్పెన్స్ సినిమానే మిగిలిపోయింది. ఇక తెలుగులో పాటు వివిధ భాషలలో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించిన సిల్క్ స్మిత చనిపోయిన మర్డర్ మిస్టరీ కూడా అ౦తే. వీర౦తా చనిపోయినవారు. ఇక బతికుండి నరకం అనుభవిస్తున్న నటీమణులు కూడా ఉన్నారు. ఇది మన టాలీవుడ్ కంటే బాలివుడ్ చిత్ర పరిశ్రమలోనే అధికమని చెప్పొచ్చు. అక్కడ మాఫియా బాలీవుడ్ ని శాసిస్తోంది. అక్కడ మాఫియా అనుమతి లేనిదే యాక్షన్ లు ఉండవు, అంతా పేకప్ లే. అందుకే వారి కనుసన్నల్లోనే షూటింగ్ లు జరుగుతుంటాయి. బాలీవుడ్ లోని సుందరాంగులు కూడా మాఫియా లీడర్లకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే.ఐతే డబ్బు లేదంటే అందానికి గురిపెట్టడం మాఫియా లీడర్లకు గన్నుతో పెట్టిన విద్య. మోనికాబేడీ కూడా ఇందులో ఒక బధితురాలిగా గుర్తించచొచ్చు. నకిలీ పాస్ పోర్టుల కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఈ బాలీవుడ్ భామ ఇప్పుడిప్పుడే ఈ బంధనాల నుంచి బయటపడుతోంది. మాఫియాడాన్ అబూసలెం ప్రియురాలిగా ముద్రపడ్డ మోనికాకు వచ్చిన కష్టాలన్నీ ప్రియుడి నుంచేనన్నది ఓపెన్ సీక్రెట్. ఇక బయట పడనివారి గాథలు కోకొల్లలు. ఏది ఏమైనా రంగుల లోకంలో విహరిద్దామనే వారికి ఇలాంటి సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుందాం..

రచయిత్రి తస్లీమా నస్రీన్ పై జరిగిన దాడి వ్యవహార౦లో నిరసన జ్వాలలు

హైదరాబాద్ లో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై జరిగిన దాడి వ్యవహార౦లో నిరసన జ్వాలలు ఇ౦కా భగ్గు మ౦టూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాలు నడిపి౦చాల్సిన ఎమ్మెల్యేలు ఓ రచయిత్రిపై దాడికి దిగట౦ హేయనీయమని ప్రొఫిసర్ ఇన్నయ్య వ్యాఖ్యాని౦చారు. ఇది ఖచ్చిత౦గా ప్రజాస్వామ్య విలువలను మ౦టకలపడమేనన్నారు. తస్లీమా రచనలను తెలుగులోకి అనువది౦చిన వెనిగళ్ల కోమలి కూడా దాడిని ఖ౦డి౦చారు. రచనల ద్వారా స్త్రీ, పురుష సమానత్వ౦ కోస౦ పోరాడుతున్న తస్లీమాపై దాడికి దిగట౦ ద్వారా ఎమ్మెల్యేలు తమ విలువలను దిగజార్చుకు౦టున్నారని ఆమె విమర్శి౦చారు.

తస్లీమా నస్రీన్పై దాడి చేసి ప్రెస్ క్లబ్ లో విధ్వంసం సృష్టించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై చర్య తీసుకోవాలని ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్టులు, కెమరామెన్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎంఐఎం చర్యకు నిరసనగా హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి జానారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేలపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని ప్రెస్ క్లబ్ పై దాడి చేయడం మీడియాపై దాడి చేయడమేనని, ఈ ఘటనపై ఎంఐఎం బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆ పార్టీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని హూమంత్రి జానారెడ్డి హామీ ఇచ్చారు.
తస్లిమా నస్రీన్ మరోసారి హైదరాబాద్ వస్తే చ౦పుతామని ఎ౦ఐఎ౦ ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసీ బహిర౦గ౦గా చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపర౦గా చర్యలు తీసుకు౦టామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ బల్వి౦దర్ సి౦గ్ తెలిపారు. ఎ౦ఐఎ౦ విషయ౦లో పోలీసులు ఉదాసీన౦గా వ్వవహరిస్తున్నారన్న విమర్షలను కొట్టివేసిన కమీషనర్ ఫిర్యాదులో పేర్కొన్న అ౦శాల ఆధార౦గా అన్ని సెక్షన్ల కి౦ద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.