Monday, May 21, 2007

రాజీవ్ గా౦ధీ వర్ధ౦తి : మే 21 : ప్రత్యేక కధన౦

నేడు పదహారేళ్ళ ప్రాయం నింపుకున్న దుర్ఘటన అది. ఆ రోజు 21 మే 1991. దక్షిణభారతదేశపు ప్రధాన నగరం చెన్నైకి దగ్గరగా వున్న ప్రాంతం, శ్రీపెరంబదూర్. ప్రజాస్వామ్యవ్యవస్థకు పున:ప్రతిష్ట చేయబోయే కార్యకలాపానికి తనవంతు బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నంలో, ఎన్నికలప్రచారంలో భాగంగా, దేశపు అతిపెద్ద, దీర్ఘకాలంపాటు ఈదేశాన్నిపరిపాలించిన రాజకీయ సంస్థకు, కుటుంబానికి ప్రతినిధి, వారసుడు. భారతీయయువశక్తికి ప్రజ్ణానసంకేతం, ప్రతిభాదర్పణం. ఆయనే భారతీయ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కి మునిమనుమడు. ప్రతిభాప్రధాని యిందిరాగాంధికి ప్రియమనుమడు. ఆయనే రాజీవగాంధి. ఆ రోజు ఎన్నికలప్రచారవేదికకు తరలి వెళ్ళాలన్న ఆయన సంకల్పం నెరవేరనే లేదు. ఆ ప్రయత్నంలోనే జరగకూడనిది జరిగిపోయింది. అంతా మాయ, భ్రమ. క్షణికం. ఆనాటి సంధ్యాసమయం అసమంజసం. అమానుషం. ఆ నిశీధకాలం నీతి బాహ్యమైన, నీచమైన రాతియుగపుచర్యకు దారితీసింది. మృతరాజీవునికి నివాళి రాజీవగాంధి హత్యను గర్హిస్తూ, ఖండిస్తూ .. సహజకవి శ్రీ మల్లెమాలగారు - అమృతరాజీవం అన్న కవితాఖండికలో - అది ... ఒక కాళరాత్రి, అఖిలావని గుండెల నొక్కసారిగా కుదిపినరాత్రి, తారకలు కుప్పగ కూలిన రాత్రి, భారతాభ్యుదయము నష్టకష్టముల ముంచి హసించిన రాత్రి, కుట్రతో చెదలు మహాగ్నిఖండమును చేకొని మ్రింగినరాత్రి అక్కటా! అని అవాక్కయ్యారు. ఈ మచ్చ మనకు ఎట్లు మనకు మాసిపోవును అని ప్రతి భారతీయుడు క్రుంగినరాత్రి. కేవలం ఒక శరీరం కాదు, ఊపిరికాదు, ఆ ఘాతుకానికి గురయ్యింది ఆవత్తు భారతదేశపు ప్రజాస్వామ్యవ్యవస్థ క్రుంగిపోయిన రాత్రి. జాతిజీవనరాగాలలో పంచమస్వరాలను వినిపించచేసిన విలక్షణమూర్తి గొంతుక ఆరోజున పలుకలేకపోయింది. జాతి మొత్తం మూగపోయింది. ప్రజాస్వామ్యానికి ప్రజ్ణానప్రతిభాప్రతినిధి ప్రజాక్షేమం కోసం ప్రజానీకం ఎన్నుకున్న ప్రజాధికారానికి కార్యవిధానరూపం ప్రజాస్వామ్యం. ఈ విధానం విభిన్న అభిప్రాయాలకు ఆహ్వానం పలుకుతుంది. వాటిని ఆదరిస్తుంది. ముందు వెనుకలు పరిశీలించి నిర్మాణాత్మక దృక్పథం ఈ ప్రజాస్వామ్య విధానంలో ఉన్నందువల్లనే ఆధునిక ప్రపంచం దీనిని అంతగా సమాదరిస్తూ వస్తున్నది. ఈ విధానంలో పాశవికతకు చోటుండదు. దానవతకు తావుండదు. హింసకూ రక్తపాతానికి దౌర్జన్యానికీ ఏ రూపంలోనూ అవకాశం ఉండదు. ఉండకూడదు. ప్రపంచ కళ్యాణాన్ని కాంక్షించే ప్రతి మనిషిది; ప్రతి మహర్షిది. ప్రతి మేధావిది. ప్రతి ప్రవక్తది. ప్రపంచ మేధావుల,మనీషుల ఆకాంక్ష, ఆశయము వుంటాయి. వుండాలి. యిది ప్రజాస్వామ్యత రూపొందించుకున్న శాస్త్రం, వేదధోరణి. ఈ మహత్తర ప్రజాస్వామ్యానికి ప్రతినిధి, నేత, పరమాదరణీయమూర్తి, భారతప్రధానుల్లో ప్రముఖుడు, రాజీవగాంధి. మూగవోయిన ప్రజాస్వామ్యమూర్తి ప్రజాస్వామ్యం సృష్టించుకున్న శాస్త్రం, నిబద్ధత సవ్యంగా సాధారణంగా నడిచేశక్తి. కాని, సవ్యం వుంటే అపసవ్యం, సమంజసత్వం వుంటే అసమంజసత్వం, రహదారుల పక్కనే పక్కదారులు, మళ్ళింపులు తొక్కడం జరుగుతుంది. అవే, ఈనాడు అక్కడక్కడ ప్రపంచంలో హింసా నినాదాలు, తీవ్రవాదాలు, అతిధోరణులకు ఆలవాలమై, అపూర్వమైన విద్రోహానికి, తీవ్రవాదానికి, ప్రజాసంక్షోభానికి దారితేస్తూ, ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే సమూలంగా పెరికి వేయడానికి ప్రయత్నాలు పలువిధాలుగా సాగే ప్రయత్నాలు జరగడమే కాదు. విద్రోహుల చర్యలు వినాశానికి దారితీస్తున్నాయి. ఈ తీవ్రవాదం క్రౌర్యానికి ఎందరో బలైపోతున్నారు. తీవ్రవాదానికి పరాకాష్టగా, యిందిరాగాంధే కాదు, ఆమె ప్రియతనయుడు రాజీవ్ గాంధి కూడ ఘోరఘాతుకానికి తనువు చాలించాడు. మహిళ, మాతృమూర్తికి మారుపేరైన జననిగర్భపొత్తిళ్ళపైన చుట్టుకున్న ఆ మారణాయుధం దారుణానికి దారితీసిన వ్యక్తి కూడ మహిళే. అనుకున్నవారిని అంతంచేసే ప్రయత్నంలో తాను కన్నుమూసినా సరే అన్న అభావంతో ఏర్పాటైన ఆత్మహత్యదళాల్లోభాగంగా తాను అన్న మహిళ ద్వారా చేయించిన ఘాతుకం. ఫలితంగా భారతయువశక్తి, ప్రజాస్వామ్యప్రతినిధి అయిన రాజీవగాంధి హత్యచేయబడ్దాడు.
విమానంతోపాటు దేశాన్నీ నడిపాడు - ప్రతిభారధసారధియానం ఫిరోజుగాంధి - యిందిరాగాంధి లకు ముంబాయిలో 1944 ఆగష్టు 20 న జన్మించిన రాజీవ్, కేంబ్రిడ్జ్ లో చదువుకునే రోజుల్లో ఇటాలియన్ మహిళ సోనియా మైనో తో పరిచయం, ప్రణయం, పరిణయానికి దారితీసాయి. చిన్నతనంనుంచి యాంత్రికవిషయాలపై శ్రద్ధాసక్తులను చుంపించిన అతని మేధస్సు వినీలాకాశంలో విహంగంలా విహరించే విమానాలపై పోయింది. ఫలితంగా విమానాలను నడిపించే వృత్తిచేపట్తాడు. కించిత్తుకూడ రాజకీయాలపై ఆసక్తిలేని రాజీవ్ కు తన సోదరుడు సంజయ్ అకాలమరణం, కుటుంబంలోనేకాక, తనజీవితంలో కూడ ఊహించని పరిణామం, మార్పు తెచ్చింది. ఫలితంగా రాజకీయరధసారధి అవ్వక తప్పలేదు. ఫలితంగా ఉత్తరప్రదేశ్ లోని అమెథికి పార్లమెంటుప్రతినిధిగా ప్రవేశించాడు. తల్లి యిందిరాగాంధి మరణాంతరం, కాంగ్రేసు సాధారణకార్యదర్శి(1983)గాను, 1984 అక్టోబర్ 31న తల్లి, ప్రధానమంత్రి యిందిరాగాంధి, తన రక్షకభటునిచేతిలోనే హత్యగావించబడ్డడం వల్ల, రాజీవ్ గాంధి దేశప్రధానిగా బాధ్యతలను స్వీకరించి, అత్యధికబలంతో విజయలక్ష్మిని వరించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్దప్రజాస్వామ్యదేశమైన భారతదేశానికి పిన్నప్రాయపు ప్రధానమంత్రిగా, స్వచ్చతమమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. ఆధునికభావాలు, నవనవోన్మేషశైలిలో పరిపాలనావిధానాలు, హృదయవాది, మనసున్నమనిషి, మహామనీషిగా, ప్రఖ్యాతుడైనాడు. పండుముసలిరూపంలో పాతుకుపోయిన అధికారరాజకీయశక్తులకు తిలోదకాలిచ్చి, యువశక్తికి ప్రాతినిధ్యం యిచ్చిన వర్ధమాన నాయకుడు. విద్యావిధానం, పారిశ్రామికీకరణం, శాస్త్ర-సాంకేతికరంగాలకు యిచ్చిన ప్రాధాన్యత, సమాచారవిప్లవపంధాధోరణులు, వయోజనవిద్య, గ్రామీణత్రాగునీటిపధకాలు, శిశుసంరక్షణారోగ్యపధకాలు, వ్యవసాయ-పశుసంరక్షణపధకాలు, దేశీయసాంకేతికపరిశోధనావిధానాలు, భారతీయతకు అనువైన ప్రణాలికలను నిర్మాణం చేసుకుని, సఫలీకరణంతో అమలుచేయడం జరిగింది, రాజీవ్ నాయకత్వంలోనే అని వేరే చెప్పనక్కరలేదు. రాజకీయంగా, పంజాబు, అస్సాం, మిజోరాం, గూర్ఖాలాండ్, పశ్చిమబెంగాలు ప్రాంతాల్లోనెలకొన్న అశాంతి, భద్రతారాహిత్యం, రక్షణలేని పరిస్థితుల్నించి, శాంతిదాయక వాతావరణాన్ని తెచ్చిన ఘనత రాజీవుడిదే. అనేక విదేశాలతో, భారతీయ రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక సంబంధాల్ని నెలకొల్పి, మెరుగుపరచిన నైపుణ్యపుపాలనకు నాయకత్వం వహించాడు. అలీనవుద్యమానికి 1986 లో భారతదేశం నాయకత్వం వహించడానికి రాజీవే బాధ్యుడు. పాలస్తీనా, దక్షిణాఫ్రికా విషయాలు, ఆర్ధికధృఢత్వనికి ప్రత్యేకనిధిని ఏర్పాటుచేయడం, మేల్-మాల్దీవులకు సైన్యసహాయం, శ్రీలంకలో వికృతరూపం దాల్చిన సమస్యకు తనదైన శైలిలో పరిష్కారాన్ని చూపడం, అమెరికా, పాకిస్తాను దేశాల చోద్యానికి, హిందూమహాసముద్రప్రాంతంలోని దేశాలపై అమెరికా, పాకిస్తాను దేశాలు కల్పించుకోవడంలో అంతంచేయడం, లాంటి చర్యలు రాజకీయరంగంలో చకితుల్ని చేసింది. ఎన్నికల తంతు , ప్రచారం తెచ్చిన విషాదం తర్వాత దశలో కొన్ని సమస్యలను తేవడం, రాజీవుని పరిపాలనలో వచ్చిన అసమ్మతివాదం, కొంచెం ఆయనకు యిబ్బందులు రావడం, 1989 ఎన్నికల్లో కోల్పోయిన ఆధిక్యత, ప్రతిపక్షపుపాత్ర వహించాడు. విపిసింగ్, చంద్రశేఖర్ ల పరిపాలన, తర్వాత వచ్చిన 1991 ఎన్నికల్లో, రాజీవ్ యిచ్చిన సుస్థిరత్వం నినాదం , రోజురోజుకి ప్రబలుతున్న విశ్వాసంతో చేరుకున్న చిట్టచివరిదశలో కొనసాగుతున్న ప్రచారరధం తమిళనాడులో, రధసారధి రాజీవ్ తోపాటు క్రుంగిపోవడం, జీవితాన్ని కోల్పోవడం, ఒకేరోజు, క్షణికం లో జరిగిపోయాయి. జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం అన్నది రాజీవ్ గాంధి విషయంలో నిజమని నిరూపణ అయింది. శ్రీలంకప్రభుత్వపు దారుణవిధానాలతో తీవ్ర అశ్రద్ధలకు గురవుతున్నందుకు తమిళపులులు నిశ్శబ్దపుసవ్వడితో గాండ్రించారు. అదృశ్యకోరలుసాచారు. ఆ విషపుకోరలను రాజీవుని చాతిలో దించారు. అంతటితో ఆగుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమనసు మూగపోయింది. తనయుడి రాహుల్ చేతులమీదుగా హస్తినాపురి వీరభూమిలో అంత్యక్రియలు జరిగాయి. రాజీవగాంధి సేవలకు గుర్తింపుగా, అత్యున్నతసత్కారం, భారతరత్న మరణాంతరం ప్రదానం చేయబడింది. రాజీవుని సేవలకు స్మృత్యర్ధం, నివాళిగా, అనేక స్మారకసంస్థలు, సమాజాభివృద్ధికి, శాస్త్ర, సాంకేతిక, కళ, సంస్కృతి, ఆరోగ్యం, వైద్య రంగాల్లో సేవలనందించడానికి అనేక ప్రయత్నాలు నేటికీ సత్ఫలితాలను అందజేఅడం సంతోషదాయకం. రాజీతనం లేని రాజీవుడు భారత రాజకీయ చరిత్ర, వ్యవస్థ వున్నంతకాలం సుస్మరణీయుడు, అమరజీవుడు. ఈ సంస్మరణీయవ్యాసం, తిరిగి మల్లెమాల ఖండికతో - ఇట్టి ఘోరకలిని ఇంకొక్క క్షణమైన సాగనీయమంచు శపథమూని, ఎల్ల ప్రజలు హింసకెదురొడ్డి పోరాడి దేశమాత బాధ తీర్పవలయు. లేడు రాజీవుడికమీద రాడటన్న చింత యేటికి? లోకమున్నంత వరకు అమృతరాజీవమై లక్షలాది ప్రజల మానస సరోవరమ్ముల మనుచునుండు అని భరతవాక్యంతో స్వస్తిపలకడం సముచితం,

No comments: