Friday, February 22, 2008
భక్తిపారవశ్యంలో మేడారం
గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క, సారలమ్మ జాతరతో మేడారం జనసంద్రంలా మారింది. తెలంగాణా ప్రాంతంలో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కిన ఈ సంబరానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ గద్దెను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కాకతీయుల కాలంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన అకృత్యాలపై తిరగబడిన సమ్మక్క- సారలమ్మలను ఇక్కడి గిరిజనులు ఆరాధ్యదేవతలుగా భావిస్తారు. రెండేళ్ళకోసారి మేడారంలో వారి పేరిట జాతర నిర్వహిస్తారు. దీనికి ఈ ఏడాది తొలి రెండు రోజుల్లోనే అరకోటి మంది భక్తులు రావడం ఈ జాతర ప్రత్యేకతను చాటుతుంది. ఇందులో సమ్మక్క, సారలమ్మలను గద్దెనెక్కించడం ఒక ఘట్టం కాగా, అనంతరం భక్తులు బెల్లం సమర్పించి పూజలు చేయడం ఆనవాయితీ. గిరిజన ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారులు చిలుకల గట్టుపై ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గట్టుమీదకు తీసుకువచ్చారు. 'సమ్మక్క తల్లికి జై' అంటూ భక్తులు ఆనంద, భక్తి పారవశ్యంతో నినాదాలు చేశారు. సమ్మక్కకు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టారు. కోళ్ళను, మేకలను బలి ఇచ్చారు. సమ్మక్క దారికి అడుగడుగునా రక్త తర్పణం చేశారు. మూడో రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సమ్మక్కను దర్శించి పూజలు చేశారు. అమ్మకు ప్రీతిపాత్రమైన బెల్లం సమర్పించారు. ఈ జాతరలో సమ్మక్కకు నిలువెత్తు బెల్లం సమర్పించడం ఆనవాయితీ. దీనిని బంగారంతో పోల్చుతూ, భక్తులు తమ తలలపై బెల్లం దిమ్మలను మోసుకు వస్తారు. అమ్మవారికి ఎన్ని కిలోల బెల్లం సమర్పించినా, ఆ ప్రాంతంలో చిన్న ఈగ గానీ, చీమ గానీ పట్టకపోవడం విశేషం. ఇలా జరగడం అంతా సమ్మక్క దయ అని భక్తులు భావిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment