Friday, August 10, 2007
సినీవనంలో మోనికాలెందరో...?
సినీ పరిశ్రమ...రంగులలోకం...ఎందరో యువతీ యువకుల కలల ప్రపంచం. ఒక్కసారైనా సినిమాల్లో నటించాలనే కోరిక చాలామంది యువతలో ఉంటుంది. దానికి కారణం సినీ ఫీల్డ్ కున్న గ్లామర్ మరే ఫీల్డ్ కు లేకపోవడమే. లక్కు బాగుంటే రాత్రికి రాత్రే స్టార్ ఐపోవచ్చనే ఆశనే యువతని అటువైపు అడుగులు వేయిస్తోంది. అతి తొందరగా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వచ్చేది కూడా ఆ రంగంలోనే. అయినా ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే రెండోవైపు చూస్తే ఎవరైనా సినిమాఛాన్స్ లపై ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే సినీరంగంలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. నిలదొక్కుకోవడం మాట అటుంచి, మొదట ఎంట్రీ దొరకడమే వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. అది ఎంతలా అంటే అమెరికాలో గ్రీన్ కార్డు దొరకేంత అని చెప్పొచ్చు. సినిమాల్లోకి ప్రవేశించడం ఒక ఎత్తైతే అందులో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. అంతో ఇంతో టాలెంట్ ఉన్నా, తెలిసిన వ్యక్తులు ఆ ఫీల్డ్ లో పని చేస్తున్నా ఎన్నో కొన్ని లకారాలు సమర్పించుకోందే పని జరగదు. ఇదంతా మగమహారాజులు సంగతి. ఇక ఆడపడుచుల ఆగచాట్లు ఇంకా దయనీయంగా ఉంటాయి. అందంగా ఉన్నా, నటన తెలిసి ఉన్నా మొదటి అవకాశాలు కోసం మొక్కుబడి తప్పటం లేదు. ఎవరు అవకాశం ఇస్తామన్న నమ్మడం, నమ్మి మోసపోవడం మామూలైపోయింది.అష్టకష్టాలుపడి తెరమీద కొచ్చిన అతివల కథ మరో విధంగా ఉంది. వచ్చిన చిన్న చిన్న అవకాశాలను చేజిక్కుంచుకుని సెటిల్ అయ్యేవరకు వారు ప్రతి వారికి లోబడే ఉండాలి. తీరా కుదురుకున్నాక ఏ బడా పారిశ్రామికవేత్తో, మాఫియా లీడరో, రాజకీయ నాయకుడో కన్నేసినా సదరు నటి తలవంచాల్సిందే. కొందరు నటీమణులు తమకో ఆర్టిస్ట్ తోనో, ప్రోడ్యూసర్, డైరెక్టర్ తోనో ప్రేమలో కూరుకుపోతుండగా, మరికొందరు బెదిరింపుల వల్ల లొంగిపోతున్నారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టి అశేష అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి దివ్యభారతి మృతి ఉదంతం అప్పట్లో ఓ సంచలనం. అది హత్యా..? ఆత్మహత్యా? అనేది ఇప్పటికి ముగింపులేని సస్పెన్స్ సినిమానే మిగిలిపోయింది. ఇక తెలుగులో పాటు వివిధ భాషలలో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించిన సిల్క్ స్మిత చనిపోయిన మర్డర్ మిస్టరీ కూడా అ౦తే. వీర౦తా చనిపోయినవారు. ఇక బతికుండి నరకం అనుభవిస్తున్న నటీమణులు కూడా ఉన్నారు. ఇది మన టాలీవుడ్ కంటే బాలివుడ్ చిత్ర పరిశ్రమలోనే అధికమని చెప్పొచ్చు. అక్కడ మాఫియా బాలీవుడ్ ని శాసిస్తోంది. అక్కడ మాఫియా అనుమతి లేనిదే యాక్షన్ లు ఉండవు, అంతా పేకప్ లే. అందుకే వారి కనుసన్నల్లోనే షూటింగ్ లు జరుగుతుంటాయి. బాలీవుడ్ లోని సుందరాంగులు కూడా మాఫియా లీడర్లకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే.ఐతే డబ్బు లేదంటే అందానికి గురిపెట్టడం మాఫియా లీడర్లకు గన్నుతో పెట్టిన విద్య. మోనికాబేడీ కూడా ఇందులో ఒక బధితురాలిగా గుర్తించచొచ్చు. నకిలీ పాస్ పోర్టుల కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఈ బాలీవుడ్ భామ ఇప్పుడిప్పుడే ఈ బంధనాల నుంచి బయటపడుతోంది. మాఫియాడాన్ అబూసలెం ప్రియురాలిగా ముద్రపడ్డ మోనికాకు వచ్చిన కష్టాలన్నీ ప్రియుడి నుంచేనన్నది ఓపెన్ సీక్రెట్. ఇక బయట పడనివారి గాథలు కోకొల్లలు. ఏది ఏమైనా రంగుల లోకంలో విహరిద్దామనే వారికి ఇలాంటి సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుందాం..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment